subhodayam › Unmadham OTT Review: కుంచాకో బోబన్ ‘ఉన్మాదం’ ఎలా ఉంది? › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

Unmadham OTT Review: కుంచాకో బోబన్ ‘ఉన్మాదం’ ఎలా ఉంది?

subhodayam
Unmadham OTT Review: కుంచాకో బోబన్ ‘ఉన్మాదం’ ఎలా ఉంది?

మలయాళ నటుడు కుంచాకో బోబన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’తో ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన.. తాజాగా ‘ఉన్మాదం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కిరణ్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లిజోమోల్ జోస్ కథానాయికగా నటించింది. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది.

కథేంటి?

పాలక్కడ్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో షెల్లీ (కుంచాకో బోబన్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అతడి భార్య సౌమ్య (లిజోమోల్ జోస్) ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇద్దరు పిల్లలున్న షెల్లీకి సినిమాలంటే చాలా ఇష్టం. పోలీస్ ఉద్యోగం చేస్తూనే సినిమా రచయిత కావాలన్నది అతడి కల.

తన కథలను దర్శకులకు వినిపిస్తూ అవకాశం కోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఎన్ని కథలు రాసినా అవి వర్కౌట్ కాకపోవడంతో భార్య నుంచి కూడా అసహనం ఎదురవుతుంది.

ఇలాంటి సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఆరేళ్లుగా ఉన్న ఓ పాత కేసు ఫైల్ షెల్లీ కంటపడుతుంది. ఓ యువతి రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. ఆ ఘటనను ప్రమాదంగా భావించి కేసును పక్కన పెట్టడం.. ఆ తర్వాత ఆ ఫైల్‌ను ఎవరు ముట్టుకున్నా వారికి అనూహ్యమైన పరిణామాలు ఎదురవడం జరుగుతుంది.

ఆ యువతి ఆత్మే ఈ ఘటనలకు కారణమనే భయంతో పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది ఆ ఫైల్‌కు దూరంగా ఉంటారు. కానీ ఆ కేసులోని నిజాన్ని సినిమా కథగా మార్చాలనే ఉద్దేశంతో షెల్లీ ఆ ఫైల్‌ను తెరిచి పరిశీలించాలని నిర్ణయించుకుంటాడు.

అసలు ఆ యువతి ఎవరు? ఆమె మరణం వెనుక ఉన్న నిజమేంటి? ఫైల్‌ను తెరిచిన షెల్లీకి ఎదురైన పరిణామాలేంటి? ఆత్మ నిజంగానే ఉందా? చివరకు నిందితులు ఎలా బయటపడతారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉంది?

‘ఉన్మాదం’ సాధారణ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్‌లా వేగంగా ప్రారంభం కాదు. కథ నెమ్మదిగా మొదలై, పాత్రలను పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది. షెల్లీ సినిమా రచయిత కావాలనుకోవడం, అతడి భార్యతో జరిగే చిన్నపాటి గొడవలు, తన కథకు మంచి క్రైమ్ పాయింట్ కోసం అతడు చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ సాగుతుంది.

అయితే పాత కేసు ఫైల్‌ను షెల్లీ ఓపెన్ చేసిన తర్వాత కథ అసలు మలుపు తిరుగుతుంది. అప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆ యువతికి నిజంగా ఏం జరిగింది? ఆమె ఆత్మే పోలీసులను వెంటాడుతోందా? అనే ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి.

ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వరుస మలుపులతో కథ వేగం పుంజుకుంటుంది. ప్రేతాత్మను పదేపదే తెరపై చూపించకుండా.. దాని ప్రభావాన్ని కథలో కొనసాగించిన విధానం ఆకట్టుకుంటుంది.

నటీనటుల పనితీరు

సినిమా మొత్తం కుంచాకో బోబన్ చుట్టూనే తిరుగుతుంది. షెల్లీ పాత్రలో ఆయన సహజమైన నటన ఆకట్టుకుంటుంది. తనను పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ.. హత్యకు గురైన యువతికి న్యాయం చేయాలనే పట్టుదలతో పోరాడే వ్యక్తిగా ఆయన నటన మెప్పిస్తుంది.

లిజోమోల్ జోస్‌తో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు.

అర్జున్ సేతు సినిమాటోగ్రఫీ, జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం, జితిన్ జాన్ ఎడిటింగ్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.

చివరగా..

నెమ్మదిగా మొదలయ్యే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ‘ఉన్మాదం’ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్టాఫ్‌లో కాస్త నెమ్మదిగా అనిపించినా.. సెకండాఫ్, ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమాను నిలబెడతాయి. ప్రేతాత్మ, పాత హత్య కేసు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, చివరి ట్విస్టులు కలిసిన ఈ కథ ఓటీటీ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తుంది.

రేటింగ్: ⭐⭐⭐½/5

మలయాళ నటుడు కుంచాకో బోబన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’తో ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన.. తాజాగా ‘ఉన్మాదం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…