ఢిల్లీ నుంచి పాట్నా మధ్య తరచూ ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే దిశగా రైల్వేశాఖ కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-పాట్నా మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత దేశంలోని తదుపరి ప్రతిష్టాత్మక హైస్పీడ్ కారిడార్లలో ఢిల్లీ-పాట్నా మార్గం కీలకంగా మారే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నాకు సాధారణ రైళ్లలో ప్రయాణించడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు దాదాపు సగం రోజును ప్రయాణంలోనే గడపాల్సి వస్తోంది.
అయితే ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ-పాట్నా మధ్య సుమారు 1,170 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా.
ఈ ప్రాజెక్ట్ అమలైతే ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, పాట్నా వంటి కీలక నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ఢిల్లీ నుంచి పాట్నా వరకు ప్రయాణిస్తే అంచనా సమయాలు ఇలా ఉండనున్నాయి:
ఢిల్లీ-పాట్నా రూట్ దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటి. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, పర్యాటకం తదితర కారణాలతో ఈ మార్గంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
అయితే ఈ మార్గానికి సంబంధించిన తుది మార్గం, స్టేషన్లు, నిర్మాణ షెడ్యూల్, రైలు వేగం, టికెట్ ధరలు వంటి వివరాలు అధికారికంగా ఖరారైన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.