హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో భారీ అక్రమ వెంచర్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. గండిపేట జలాశయ పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌పై హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు.
సోమవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో వెంచర్‌లో క్లబ్‌హౌస్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు, ఇతర కాంక్రీట్ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్లతో కూల్చివేశారు. అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్మించిన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బాక్స్ డ్రెయిన్లను కూడా ధ్వంసం చేశారు.
రెండు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, సీఎంసీ అధికారులు జన్వాడలో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంచర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. అనంతరం సంబంధిత రియల్టర్లకు నోటీసులు జారీ చేశారు.
తహసీల్దార్ ఆదేశాల మేరకు సోమవారం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
జలాశయాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టే నిర్మాణాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. జన్వాడలో చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ అనధికార నిర్మాణాలపై అధికారులు చర్యలను వేగవంతం చేశారు. సోమవారం ఒక్కరోజే కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో కలిపి 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
మరో 15 అనధికార నిర్మాణాలను గుర్తించగా.. వాటిలో ఒక నిర్మాణాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.