subhodayam › మూసీ ప్రక్షాళనకు కౌంట్‌డౌన్.. దసరా రోజున తొలి దశ పనులకు… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

మూసీ ప్రక్షాళనకు కౌంట్‌డౌన్.. దసరా రోజున తొలి దశ పనులకు శ్రీకారం!

subhodayam
మూసీ ప్రక్షాళనకు కౌంట్‌డౌన్.. దసరా రోజున తొలి దశ పనులకు శ్రీకారం!

హైదరాబాద్ నగరానికి కీలకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశ పనులను దసరా పండుగ రోజున ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలను వేగవంతం చేశారు.

ఫేజ్-1 పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,345.12 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో రూ.4,500 కోట్లను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రుణంగా సమీకరించనున్నారు. మిగిలిన రూ.2,845.12 కోట్లను HMDA, TGIIC ద్వారా సమకూర్చేలా ప్రణాళిక రూపొందించారు.

ఫేజ్-1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను ఇప్పటికే ADBకి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. రుణ మంజూరు ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో దసరా నాటికి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రెండు మార్గాల్లో ఫేజ్-1 పనులు

మూసీ నది అనంతగిరి కొండల్లో మూసా, ఈసీ అనే రెండు పాయలుగా ఉద్భవిస్తుంది. ఈసీ నదిపై హిమాయత్‌సాగర్, మూసా నదిపై ఉస్మాన్‌సాగర్ జలాశయాలు ఉన్నాయి. ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు ప్రవహించే నీరు లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద కలుస్తుంది. అక్కడి నుంచి మూసీ నదిగా ప్రవహిస్తుంది.

తొలి దశలో హిమాయత్‌సాగర్–బాపూఘాట్ మధ్య 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్–బాపూఘాట్ మధ్య 11.8 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రెండు మార్గాల్లోని పనులను సమాంతరంగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ప్రక్షాళనతో పాటు సుందరీకరణ

ఫేజ్-1లో మూసీ నదిలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించడంతో పాటు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయనున్నారు. బోటింగ్ వంటి వినోద సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళికలో ఉంది.

నదికి ఇరువైపులా రోడ్లు, ల్యాండ్‌స్కేపింగ్, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని మురుగు నీరు నదిలో కలవకుండా ఇరువైపులా భారీ ట్రంక్ లైన్లు, వర్షపు నీటి డ్రెయిన్లను నిర్మించడం ప్రాజెక్టులో కీలక అంశంగా ఉంది.

ఫేజ్-1 పనులు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ గేట్‌వే నిర్మాణంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగోలు నుంచి గౌరెల్లి వరకు ప్రతిపాదించిన ఫేజ్-2 పనులకు సంబంధించిన DPR తయారీని కూడా అధికారులు వేగవంతం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరానికి కీలకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశ పనులను దసరా పండుగ రోజున ప్రారంభించేలా…