subhodayam › కన్నీళ్లు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

కన్నీళ్లు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ

subhodayam
కన్నీళ్లు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మేనల్లుడు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడంపై స్పందిస్తూ ఆయన కంటతడి పెట్టారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈ ఉద్విగ్నభరిత వాతావరణం చోటుచేసుకుంది.

చిన్న శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని, కార్యకర్తలతో అతనికి ఉన్న సంబంధాలను గుర్తుచేసుకుంటూ బొత్స ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అనంతరం తేరుకున్న ఆయన, కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. "రాజకీయాల్లో వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ పార్టీ శాశ్వతం. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు పార్టీలు మారుతుంటారు. ఎవరూ అధైర్యపడొద్దు" అని ఆయన పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, తాను, ఇతర సీనియర్ నేతలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రస్థాయి బాధ్యతల్లో తాను బిజీగా ఉండటంతో జిల్లా, నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా చిన్న శ్రీనుకే అప్పగించానని బొత్స గుర్తుచేశారు. అయితే, కనీసం కార్యకర్తలకు కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీ మారడం అందరినీ షాక్‌కు గురిచేసిందని పలువురు నేతలు అన్నారు.

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మేనల్లుడు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)…