subhodayam › అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్‌రావుపై మహిళా పోలీసుల… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్‌రావుపై మహిళా పోలీసుల ఫిర్యాదు

subhodayam
అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్‌రావుపై మహిళా పోలీసుల ఫిర్యాదు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ వద్ద భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్లు ఫిర్యాదులో ఉన్నట్లు సమాచారం. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గేట్ నంబర్‌ 3 వద్ద మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు నల్ల టీ-షర్టులు, ప్లకార్డులతో అక్కడికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజకీయ నినాదాలతో కూడిన టీ-షర్టులు, ప్లకార్డులకు అసెంబ్లీ భద్రతా నిబంధనల ప్రకారం అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వివాదం మొదలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు తమపై దుర్భాషలాడారని మహిళా కానిస్టేబుల్ ఆరోపించారు.

హరీశ్‌రావు, కేటీఆర్ తమను అవమానకరంగా దూషించారని ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా హరీశ్‌రావు టీ-షర్టు విప్పి పోలీసు అధికారిపైకి విసిరారని, మహిళా సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం.

మరోవైపు నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి కూడా తమతో అనుచితంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ పేర్కొన్నారు. ఈ ఘటనలో విధి నిర్వహణకు ఆటంకం కలిగిందని ఆమె ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదును స్వీకరించిన సైఫాబాద్ పోలీసులు సంబంధిత BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది.

ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై రాజకీయ విమర్శలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆరోపణలపై కేటీఆర్, హరీశ్‌రావు తదితరుల స్పందన, పోలీసుల దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ వద్ద భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు దురుసుగా ప్రవర్తించారన్న…