న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల మధ్య 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశాల కోసం రాజధాని నగరం సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా సదస్సులో పాల్గొననున్నారు.
బ్రిక్స్‌లో ప్రస్తుతం 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాల అధినేతలతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు సదస్సుకు హాజరవుతారు. నేతల రాక నేపథ్యంలో విమానాశ్రయాలు, హోటళ్లు, సదస్సు వేదిక పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో సుమారు 30 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్యంలో మార్పులు, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో ఈ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహార, ఇంధన భద్రతతో పాటు ఆరోగ్యం, వ్యవసాయం, విపత్తుల నివారణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక సరఫరా వ్యవస్థల్లో సహకారం పెంపొందించడంపై నేతలు చర్చించనున్నారు.
ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధి పరిస్థితులు బ్రిక్స్ దేశాల మధ్య చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు ఒకే వేదికపై ఉండటంతో ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించడం కూడా సవాలుగా మారే అవకాశం ఉంది.
సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, ఫార్మాస్యూటికల్స్ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
అదే సమయంలో మోదీ-జిన్‌పింగ్ భేటీ కూడా అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే బ్రిక్స్‌లో భిన్నమైన దేశాల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడం భారత్‌కు కీలకంగా మారింది.