subhodayam › విద్యతోనే జీవితాల్లో మార్పు.. తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నాం:… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

విద్యతోనే జీవితాల్లో మార్పు.. తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

subhodayam
విద్యతోనే జీవితాల్లో మార్పు.. తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: విద్యే జీవితాలను మార్చే శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చదువుకు దూరమైతే ఎంత ఆస్తి ఉన్నా సామాజికంగా వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అక్షరం ఒక్కటే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదని చెప్పారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు.

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు కేశవరావు కమిటీని నియమించినట్లు వివరించారు.

ప్రస్తుతం తెలంగాణలోని 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి 1.57 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. జెన్‌ జీతో పాటు జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా తరాల భవిష్యత్తును తరగతి గదుల్లోనే తీర్చిదిద్దేలా విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు.

టీచర్ నియామకాల్లో వేగం

ఉపాధ్యాయుల నియామకంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.

ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా 55 రోజుల్లో 10,600 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. రైట్ టు ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా, తెలంగాణలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారని వివరించారు.

విద్యా రంగానికి గతంలో తగ్గుతూ వచ్చిన బడ్జెట్ కేటాయింపులను తమ ప్రభుత్వం పెంచుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సభ్యులు ఇచ్చిన సూచనలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌: విద్యే జీవితాలను మార్చే శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చదువుకు దూరమైతే ఎంత ఆస్తి ఉన్నా సామాజికంగా వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అక్షరం ఒక్కటే మనిషిని…