అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సుమారు 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉన్నట్లు పేర్కొంది.
అదే సమయంలో దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మంగళవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం కూడా ఆయా ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాయలసీమ జిల్లాల్లోనూ రాబోయే మూడు రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షం సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.