మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని తీసుకునే బాధ్యతను ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డికి అప్పగించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా సదరు నిందితుడితో పోలీసులు వ్యక్తిగత పనులు చేయించుకోవడంతో పాటు ప్రతిరోజూ బిర్యానీ, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని ఒత్తిడి చేసేవారని ఆరోపణలు వచ్చాయి.
వేధింపులతో విసిగిపోయిన నిందితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సీఐ, ఎస్ఐపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.