కేసీఆర్ ఫామ్‌హౌస్, కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు 1,000 ఎకరాల భూమి ఉందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ కుటుంబం పేరుతో ఉన్న భూమి 67 ఎకరాలు మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణకు తాము సిద్ధమని చెప్పారు. ఇదే తరహాలో రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపైనా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని ప్రేమించే వ్యక్తి అని, భూమిని వ్యాపార వస్తువుగా కాకుండా వ్యవసాయానికి సంబంధించిన ఆస్తిగా భావించేవారని కేటీఆర్ అన్నారు. చింతమడకలోని తమ పాత ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఇచ్చామని తెలిపారు.
మరోవైపు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టుపక్కల భూములపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. సుమారు 700 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
దీంతో కేసీఆర్ కుటుంబ భూములు, 22-ఏ భూముల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.