తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించనున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. అలాగే దసరా సెలవుల తేదీలను కూడా వెల్లడించింది.
అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు SA-1 పరీక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.
పరీక్షల నిర్వహణలో భాగంగా వివిధ తరగతులకు వేర్వేరు పరీక్ష సమయాలను నిర్ణయించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6, 8వ తరగతులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు.
ఇక 7వ తరగతికి మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 9వ తరగతికి మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆయా తరగతులకు సంబంధించిన సబ్జెక్టులు, పరీక్ష తేదీలతో కూడిన పూర్తి టైమ్‌టేబుల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.