subhodayam › మట్టి రోడ్ల నుంచి జాతీయ పతకాల దాకా.. అత్వెల్లి అథ్లెట్… › e-Paper Clip subhodayam
Share: f 𝕏 ✉ ✈ in @

మట్టి రోడ్ల నుంచి జాతీయ పతకాల దాకా.. అత్వెల్లి అథ్లెట్ మండల స్నేహ ప్రస్థానం

subhodayam
మట్టి రోడ్ల నుంచి జాతీయ పతకాల దాకా.. అత్వెల్లి అథ్లెట్ మండల స్నేహ ప్రస్థానం

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా పరుగులు.. గాయాన్ని జయించి మళ్లీ ట్రాక్‌పైకి

జాతీయ స్థాయిలో పతకాలతో సత్తా చాటుతున్న 17 ఏళ్ల యువ అథ్లెట్

మేడ్చల్: సరైన క్రీడా మైదానం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాల ట్రాక్ లేదు.. నాణ్యమైన క్రీడా పరికరాలు అందుబాటులో లేవు. ఆర్థిక పరిమితులు మరోవైపు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది మేడ్చల్ మండలం అత్వెల్లికి చెందిన యువ అథ్లెట్ మండల స్నేహ. ప్రస్తుతం 17 ఏళ్ల వయసులోనే పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని 60 నుంచి 70 వరకు పతకాలు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పీఈటీ గుర్తించిన ప్రతిభ

చిన్నతనంలోనే స్నేహలోని క్రీడా ప్రతిభను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ గుర్తించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేక క్రీడా మైదానం అందుబాటులో లేకపోవడంతో రోడ్లపైనే లాంగ్ రన్స్ చేయిస్తూ ప్రాథమిక శిక్షణ అందించారు. అనంతరం 2020లో ‘డ్రీమర్స్ అకాడమీ’ కోచ్ కె. ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో స్నేహ ప్రొఫెషనల్ శిక్షణ ప్రారంభించింది.

ప్రస్తుతం బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ చివరి సంవత్సరం చదువుతున్న స్నేహ.. విద్యతో పాటు క్రీడకు సమాన ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు ఐదు గంటలపాటు శిక్షణ తీసుకుంటోంది. కోచ్ సూచనల మేరకు పోషకాహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది.

ఖమ్మం పోటీలు.. కెరీర్‌లో కీలక మలుపు

స్నేహ క్రీడా ప్రయాణంలో ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు కీలక మలుపుగా నిలిచాయని ఆమె పేర్కొంది. ఆ పోటీల అనంతరం రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

2021లో అసోంలో జరిగిన ఆల్ ఇండియా జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. అనంతరం పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధించింది. 2026లో పుదుచ్చేరిలో జరిగిన సౌత్ జోన్ నేషనల్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది.

ఏడాదిన్నర పాటు గాయం నుంచి కోలుకున్న స్నేహ

2024లో స్నేహ కుడి మోకాలికి తీవ్ర గాయం కావడంతో కొంతకాలం క్రీడలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాదాపు ఏడాదిన్నరపాటు కోలుకునే ప్రక్రియ కొనసాగింది. ఈ సమయంలో మోకాలి కండరాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిన స్నేహ.. శిక్షణలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. పోటీల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా వాటిని విశ్లేషించుకుని తదుపరి పోటీలకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపింది.

కుటుంబం అండ.. వసతుల కొరత

స్నేహ కుటుంబం ఆర్థికంగా మధ్యతరగతి స్థాయిలో ఉన్నప్పటికీ ఆమె క్రీడా ప్రయాణానికి కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. తండ్రి మండల రాజగోపాల్, తల్లి సంధ్యారాణి, సోదరుడు శివాంశ్, నానమ్మ పెంటమ్మ, వదిన పుష్పలతతో పాటు కుటుంబ సభ్యులు పోటీల సమయంలో ఆమెకు అండగా నిలుస్తున్నారు.

అయితే సరైన అథ్లెటిక్స్ ట్రాక్, గ్రౌండ్, నాణ్యమైన స్పైక్స్, శిక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం స్నేహకు ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటివరకు అధికారికంగా లేదా ప్రైవేట్‌గా స్పాన్సర్‌షిప్ కూడా అందలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఒలింపిక్ పతకమే లక్ష్యం

తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమని స్నేహ చెబుతోంది. చిన్నారులు చదువుతో పాటు ఏదో ఒక క్రీడను ఎంచుకోవాలని సూచిస్తోంది. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొంది.

“భారతదేశం గర్వపడేలా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే మరింత కష్టపడి శిక్షణ తీసుకుంటాను” అని స్నేహ తెలిపింది.

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా పరుగులు.. గాయాన్ని జయించి మళ్లీ ట్రాక్‌పైకి జాతీయ స్థాయిలో పతకాలతో సత్తా చాటుతున్న 17 ఏళ్ల యువ అథ్లెట్ మేడ్చల్: సరైన క్రీడా మైదానం లేదు..…