దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. ఈస్ట్ జోన్ ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ 44 పరుగులతో వెనుదిరిగాడు. అర్ధశతకానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉండగా ఔటవడంతో అరుదైన రికార్డు అతడి చేజారింది.
ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో చామ వి. మిలింద్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతి అతడికి సమస్యగా మారింది.
బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో తడబడిన వైభవ్ దానిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ పైభాగాన్ని తాకడంతో మిడ్ వికెట్ దిశగా గాల్లోకి వెళ్లింది.
అక్కడే డీప్ స్క్వేర్ లెగ్ నుంచి వచ్చిన సౌత్ జోన్ ప్రత్యామ్నాయ ఫీల్డర్ త్యాగరాజన్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ 44 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.

రికార్డు ఇలా మిస్ అయింది
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 50 పరుగులు సాధించి ఉంటే.. అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉండేది. కానీ మిలింద్ వేసిన షార్ట్ బాల్ అతడి రికార్డు ప్రయాణానికి బ్రేక్ వేసింది.
44 పరుగుల వద్ద ఔటైనప్పటికీ వైభవ్ చూపించిన బ్యాటింగ్ తెగువ మరోసారి అతడి ప్రతిభను చాటిచెప్పింది. రికార్డు మిస్ అయినా.. ఈ యువ క్రికెటర్ ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.
