శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల దుమారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దాడులు, ప్రతిదాడులకు దారితీసింది. ఓవైపు అసెంబ్లీలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, తీవ్ర పరిణామాల సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయల్దేరారు. స్పీకర్ వివాదం, సభలో అసెంబ్లీ గేటు వద్ద మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తన, అభ్యంతరకర భాషపై తదుపరి కార్యాచరణను అధినేత కేసీఆర్‌తో చర్చించి ఆయన దిశానిర్దేశం తీసుకోనున్నారు.

మరోవైపు, స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి పిలుపునిస్తూ వెయ్యి డప్పులతో బయల్దేరడంతో పరిస్థితి దారితప్పింది. మర్కుక్ మండలం దామరకుంట వద్ద ఫాంహౌస్ వైపు వస్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల వాహనాలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో ఇరువర్గాలు రోడ్డుపైనే తీవ్ర తోపులాటకు దిగాయి.
పరిస్థితి తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఫాంహౌస్ పరిసర ప్రాంతాలలో ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. వెంకటాపూర్, ఎర్రవల్లి శివారు దారుల్లో భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నిరసనకారులు ఫాంహౌస్ దరిదాపుల్లోకి రాకుండా పహారా పెంచి, వందలాది మంది పోలీసులతో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
