హైదరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) డిమాండ్ చేసింది. ఈ మేరకు CITU బాచుపల్లి మండల కమిటీ నాయకులు పి. స్వామి, పి. భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు.
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 9న చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం సందర్భంగా CITU బాచుపల్లి మండల కన్వీనర్ రాథోడ్ సంతోష్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు, ఉద్యోగులను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని CITU నాయకులు స్పష్టం చేశారు. కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
CITU ప్రధాన డిమాండ్లు
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు డిమాండ్లను CITU ముందుకు తెచ్చింది.
- ప్రీ, ప్రైమరీ, పీరంశ్రీ కలిపి ఉన్న మొత్తం 4,131 కేంద్రాలను రద్దు చేసి, వాటిని అంగన్వాడీలకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
- ICDSకు నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ ఉద్యోగులకు రూ.18,000 వేతనం వెంటనే అమలు చేసి PF సౌకర్యం కల్పించాలి.
- టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన 15 వేల ఖాళీ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలి.
- BLO పెండింగ్ డబ్బులు, SIR డ్యూటీ అమౌంట్‌ను వెంటనే చెల్లించాలి.
- పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్ల ఏరియర్స్, హెల్పర్ నుంచి టీచర్‌గా ప్రమోట్ అయిన వారికి పెండింగ్ ఏరియర్స్, PRC ఏరియర్స్, 24 రోజుల సమ్మె వేతనాలు తదితర బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తక్షణమే పరిష్కరించాలని CITU బాచుపల్లి మండల కమిటీ డిమాండ్ చేసింది.
