తెలంగాణ శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దళిత సంఘాలు, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు నిరసన తెలిపిన అనంతరం బీఆర్‌ఎస్ నేతలు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారన్న అంశం సభలో చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం వెనుక బీఆర్‌ఎస్ నాయకుల కులతత్వం బయటపడిందని ఆయన విమర్శించారు. ఇది దళిత సమాజ ఆత్మగౌరవాన్ని, హక్కులను అవమానించడమేనని ఆరోపించారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసెంబ్లీ గేటు వద్ద దూషించిన ఘటనపై కూడా మంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ‘శుద్ధి’ వ్యవహారంపై సభలో సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే మంత్రి ప్రసంగానికి బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుతగిలారు. పలువురు ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువైపులా పోటాపోటీ నినాదాలతో సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
