దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం సరికొత్త మొబైల్ ఇమ్మిగ్రేషన్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘క్లిక్ & ట్రావెల్’ పేరుతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా రద్దీ సమయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయనున్నారు.
దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) రూపొందించిన ఈ విధానంలో ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక మొబైల్ పరికరాలతో అధికారులు ప్రయాణికులు ఉన్న ప్రదేశానికే వెళ్లి ఎంట్రీ లేదా డిపార్చర్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ పరికరాలు GDRFA కేంద్ర వ్యవస్థలు, డేటాబేస్‌లకు అనుసంధానమై ఉంటాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ప్రయాణికుల గుర్తింపును నిర్ధారించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియకు కేవలం 12 నుంచి 15 సెకన్ల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం డిపార్చర్ ప్రయాణికులందరికీ ఈ సేవ అందుబాటులో ఉంది. యూఏఈ పౌరులు, నివాసితులు, సందర్శకులు దీనిని వినియోగించుకోవచ్చు. అయితే అరైవల్ ప్రయాణికుల విషయంలో తొలిదశలో యూఏఈ పౌరులు, నివాసితులకు మాత్రమే సేవ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర దేశాల ప్రయాణికులకు కూడా విస్తరించనున్నారు.

విమానాశ్రయంలో అనూహ్యంగా రద్దీ పెరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇతర కార్యాచరణ ఒత్తిళ్ల సమయంలో ఈ మొబైల్ సేవను వినియోగించనున్నారు. దీంతో ప్రయాణికులు క్యూలలో వేచి ఉండే సమయం తగ్గనుంది.
‘క్లిక్ & ట్రావెల్’ పైలట్ కార్యకలాపాలు మే 2026లో ప్రారంభమయ్యాయి. ఆగస్టు 31, 2026 నాటికి ఈ సేవ ద్వారా 31,373 లావాదేవీలు విజయవంతంగా పూర్తయినట్లు GDRFA వెల్లడించింది.
