అందరం ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేద్దాం, నిజమైన ప్రజా సేవకులుగా నిలుద్దాం. రివ్యూల నుంచి రిజల్ట్స్ వైపు పయనిద్దాం. వన్ స్టేట్, వన్ మిషన్, వన్ ఎయిమ్.. అదే స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సును ప్రారంభించిన ఆయన, తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. నాయకత్వ లక్షణాలు, సుపరిపాలన, అభివృద్ధి మంత్రాలను అధికారులకు వివరించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాం
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా గత 27 నెలల్లో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ కాలంలో రూ. 1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ. 1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్‌కు కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి కార్యక్రమాలతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశామన్నారు. 2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుంటే, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రం 13.44 శాతం వృద్ధి రేటు సాధించిందని, దీన్ని 15 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు. జీఎస్టీ వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే రూ.25,450 కోట్లు పెరిగాయని, ప్రతి నెలా ఆర్థిక నివేదిక విడుదల చేస్తూ లక్ష్యాలను బేరీజు వేసుకుంటున్నామని తెలిపారు.
‘వాటర్ మ్యాన్’ గుర్తింపు ఎంతో సంతోషాన్నిచ్చింది
తనకు ‘గ్లోబల్ డ్రీమ్ కేబినెట్’లో చోటు దక్కినప్పుడు గానీ, ‘సీఈఓ సీఎం’ అని పిలిచినప్పుడు గానీ కలగని ఆనందం, ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక తనను ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించినప్పుడు కలిగిందని చంద్రబాబు అన్నారు. “రాష్ట్రంలోని భౌగోళిక అసమానతలను సరిచేస్తూ, నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతాలకు నీరందించగలిగితే కలిగే సంతోషం వేరు. గోదావరి-కావేరి-మహానది-గంగ వంటి నదులను అనుసంధానించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్‌స్టాపబుల్ అవుతుంది” అని ఆయన తన దార్శనికతను పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి చేశామని గుర్తుచేశారు.
గత ప్రభుత్వ వైఫల్యాలు.. ప్రస్తుత సవాళ్లు
గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, వారి నిర్వాకం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “గత ప్రభుత్వ హయాంలో మార్కెట్లోకి వచ్చిన ‘జే’ బ్రాండ్ల కల్తీ మద్యం కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆరోగ్యం దెబ్బతింది. మేం అధికారంలోకి వచ్చాక ఆ కల్తీ బ్రాండ్లను రద్దు చేసి, పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూస్తున్నాం” అని తెలిపారు. విద్యుత్ టారిఫ్‌లు పెంచకుండానే నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తికాలేదని, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను సరిగా వినియోగించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది తీవ్రమైన ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఇది నీటి భద్రతకు సవాలుగా మారిందని, ఇలాంటి సంక్షోభ సమయంలోనే కలెక్టర్ల నాయకత్వ పటిమ బయటపడాలని పిలుపునిచ్చారు.
