అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల సదస్సుకు కొందరు శాఖాధిపతులు హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
సమావేశానికి రాని అధికారుల నుంచి తక్షణమే సంజాయిషీ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఆదేశించారు. అధికారులంతా సదస్సులో పూర్తి ఏకాగ్రతతో పాల్గొనాలని, మొబైల్ ఫోన్లను సమావేశాలకు తీసుకురావద్దని సూచించారు.
ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపైనా సీఎం సీరియస్ అయ్యారు. కొన్ని శాఖల్లో ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ కమిషనర్ వద్ద 10 రోజులుగా ఫైళ్లు పెండింగ్‌లో ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇకపై ఆఫ్‌లైన్ ఫైళ్లకు తావు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులకు ఐటీపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
అదే సమయంలో జిల్లాల్లో కలెక్టర్లు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను సీఎం అభినందించారు. ప్రతి జిల్లాను ఆర్‌అండ్‌డీ హబ్‌గా అభివృద్ధి చేసి, మంచి విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారు.

