వరంగల్: పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ఓ మహిళా రైతు పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళా రైతు తన పొలంలో ‘రేవంత్ అన్నా.. మా రైతులను ఆదుకోండి’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది అప్పు చేసి పంట సాగు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంట ఎండిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలోనూ నీరు అందక పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
పంట సాగు కోసం అప్పులు చేశామని, ప్రస్తుతం బ్యాంకు రుణాలు చెల్లించే పరిస్థితిలో లేమని లక్ష్మి పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.
