ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
రిజర్వేషన్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆధారంగా తీసుకున్న గణాంకాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, సమగ్ర కుటుంబ సర్వే వివరాలపై హైకోర్టు ఆరా తీసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? అది ఏ అంశాలపై అధ్యయనం చేసింది? 34 శాతం రిజర్వేషన్లకు ఏ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? అనే వివరాలను కోర్టు కోరింది.

సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటాను కూడా కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 34 శాతం కోటాను నిర్ణయించడానికి ఈ సర్వే, కమిషన్ గణాంకాలు ఉపయోగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు, మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతాన్ని మించే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం మాత్రం 34 శాతం రిజర్వేషన్‌కు గణాంకపరమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించింది.
ప్రభుత్వం సమర్పించిన నివేదికలు, గణాంకాలు, ఇతర ఆధారాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పుపైనే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల తదుపరి ప్రక్రియ ఆధారపడనుంది.
