శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) జారీ చేసిన ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కోలుకోలేని నష్టమని వ్యాఖ్యానించారు.
కేఆర్ఎంబీ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఎల్‌నినో పేరుతో తెలంగాణ హక్కులను కాలరాస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిబంధనల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తోందో స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ నీటి తరలింపు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం ద్వారా ఏపీకి సహకరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి అప్పగించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో ఆగస్టు 21న 169 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వలు 15 రోజుల్లో 139 టీఎంసీలకు పడిపోవడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. కేవలం 15 రోజుల్లో 30 టీఎంసీల నీరు ఎలా తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి వద్ద కేవలం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్న కేటీఆర్.. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, రైతులకు జరుగుతున్న నష్టాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
