మూడు రోజుల సభా కార్యక్రమాలపై సీఎం ఫైర్.. ఓటర్ల జాబితాపైనా ఎమ్మెల్యేలకు కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ వేదికగా అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు వ్యూహాలు రూపొందించారని సీఎం ఆరోపించారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు ఆటంకం కలిగించారని ఆరోపించారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సభాపతిపైనా తీవ్ర పదజాలం ఉపయోగించారని మండిపడ్డారు.

నిరసనలపై సీఎం ఆగ్రహం
అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా అధికారుల సమక్షంలో టీషర్టులు విప్పి నిరసన వ్యక్తం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితుల నిరసనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం ద్వారా వారిని అవమానించారని అన్నారు.
సభ ప్రారంభం నుంచి చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తరఫున సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ప్రతిపక్ష నిరసనలను ఎదుర్కొంటూ సభా కార్యక్రమాలను కొనసాగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అభినందించారు.
సునీత, సబితలపై రేవంత్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎదిగిన కొందరు నాయకులు ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే వారు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ప్రశ్నించారు.
పోలీసు అధికారులపై బీఆర్ఎస్ నేతల తీరుపైనా సీఎం స్పందించారు. పోలీసు సిబ్బందిలో కేటీఆర్‌కు తన ప్రతిబింబమే కనిపిస్తున్నట్టుందని, అందుకే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వెయ్యి రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు.
శాసన మండలిని చారిత్రక భవనంలో పునఃప్రారంభించడం, అసెంబ్లీ సెంట్రల్ హాల్‌కు దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టడం వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించనున్న జనాభా లెక్కల్లో తెలంగాణ కులగణన నమూనాను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
‘ఎస్ఐఆర్’ పేరుతో భారీగా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వయోజనుల జనాభా, ఓటర్ల జాబితాలో నమోదైన సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.
తమ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను నిరంతరం పరిశీలించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలనుకునే ప్రతి ఎమ్మెల్యే ఓటు హక్కు పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.
