హైదరాబాద్: నగర ప్రజలకు అవసరమైన కీలక సమాచారాన్ని ఒకే వేదికపై అందించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త అడుగు వేసింది. ఇందులో భాగంగా శుక్రవారం అధికారిక వెబ్‌సైట్/పోర్టల్‌ను ప్రారంభించింది. ఏజెన్సీ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
చెరువులు, వరదలు, నీటిముంపు ప్రాంతాలు, భూ రికార్డులు, వాతావరణం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆస్తులు కొనేవారికి ఉపయోగకరం
ముఖ్యంగా ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసేవారికి ఈ పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. చెరువులు, ఇతర నీటి వనరుల సమీపంలో ఆస్తి కొనుగోలు చేసే ముందు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్ వివరాలను పరిశీలించుకునే అవకాశం కల్పించారు.
ఇందుకోసం హెచ్‌ఎండీఏ లేక్స్ పోర్టల్‌కు నేరుగా యాక్సెస్ ఇచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వరద, నీటిముంపు ప్రాంతాల మ్యాపులను కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
భూ రికార్డులు, వాతావరణ సమాచారం కూడా
వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారాన్ని కూడా పోర్టల్‌లో పొందుపరిచారు. భూ రికార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వ ‘భూ భారతి’ పోర్టల్‌కు నేరుగా లింక్ అందించారు. సర్వే నంబర్ లేదా పట్టాదారు వివరాలతో భూమికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

అదేవిధంగా హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ప్రజలు వీక్షించవచ్చు. హైడ్రా అధికారిక ప్రకటనలు, అత్యవసర సహాయ సమాచారం కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉండనుంది.
