తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలుచోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 24 గంటల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్‌లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
నగరంలో వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
మూసీ పరివాహక ప్రాంతాలపై అలర్ట్
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు.
జలాశయాలకు భారీగా వరద నీరు చేరి గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
వినాయక చవితి వేళ మరింత అప్రమత్తత
గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నందున మండపాలు, నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
నాలాల్లో పూడిక ఉంటే వెంటనే తొలగించాలి
డీ-సిల్టింగ్ పనుల్లో బయటకు వచ్చిన పూడిక, మట్టి, రోడ్లపై ఉన్న డెబ్రిస్‌ను వెంటనే తరలించాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అవి తిరిగి నాలాల్లోకి చేరితే నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
ఎయిర్‌టెక్ యంత్రాలు, ఎమర్జెన్సీ సిబ్బందిని అందుబాటులో ఉంచి.. సమస్య తలెత్తిన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
