శిర్డీ: శిర్డీ సాయిబాబాకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అరుదైన కానుక సమర్పించారు. అమెరికాలో స్థిరపడిన సాయి భక్తుడు చంద్రశేఖర్ కమ్మెట్టి సుమారు రూ.75 లక్షల విలువైన బంగారు, వెండి గొడుగును సాయిబాబా సంస్థాన్‌కు అందజేశారు. సాయిబాబాపై తనకున్న అపారమైన భక్తి, విశ్వాసానికి గుర్తుగా ఈ కానుకను సమర్పించినట్లు చంద్రశేఖర్ తెలిపారు.
1998లో తొలిసారి శిర్డీకి..
చంద్రశేఖర్ కమ్మెట్టి స్వస్థలం హైదరాబాద్. ఉన్నత విద్య కోసం 1998లో అమెరికాకు వెళ్లిన ఆయన.. అదే ఏడాది తొలిసారి శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. అప్పటి నుంచి శిర్డీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న చంద్రశేఖర్.. ప్రతి ఏడాది నాలుగైదుసార్లు శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకుంటున్నట్లు తెలిపారు. తన జీవితంలోని అనేక సందర్భాల్లో సాయిబాబా తనకు దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు.
250 గ్రాముల బంగారం.. 9 కిలోల వెండి
సాయిబాబా విగ్రహాన్ని అలంకరించడంతో పాటు పల్లకీ ఊరేగింపు సమయంలో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఈ గొడుగును తయారు చేయించారు. అత్యంత కళాత్మకంగా రూపొందించిన ఈ గొడుగులో 250 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 9 కిలోల వెండి వినియోగించారు.
గొడుగు మొత్తం బరువు సుమారు 9.25 కిలోలు కాగా.. దీని తయారీకి దాదాపు రూ.75 లక్షలు ఖర్చయినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు.

బాబా అనుగ్రహమే..
గొడుగు సమర్పించే అవకాశం లభించడం సాయిబాబా అనుగ్రహంగా భావిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. తన జీవితంలో బాబా ఎన్నో అనుభవాలను అందించారని, ఈ పవిత్ర కార్యక్రమంలో తాను కేవలం ఒక మాధ్యమంగా ఉండే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
గొడుగు సమర్పణ కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గడిల్కర్‌కు చంద్రశేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా భక్తి విలువను కానుక ధరతో కొలవలేం. అయితే ఈసారి శిర్డీ సాయిబాబా దర్బారుకు చేరిన ఈ రూ.75 లక్షల బంగారు, వెండి గొడుగు భక్తి భావంతో పాటు కళాత్మకతకు ప్రత్యేక నిదర్శనంగా నిలిచింది.
