హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరును మరింత ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని ఎత్తిపోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో సుమారు 80 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన పనులను పూర్తి చేస్తే 60 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని విమర్శించారు.
ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని చెప్పారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రజా సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తామని హరీశ్ రావు వెల్లడించారు. సెక్షన్ 22ఏ కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యుత్ కోతలు, రుణమాఫీ, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి అంశాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా సభలో ప్రస్తావిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?
కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించే భాషను వినేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు వంటి నేతలు అసెంబ్లీలో అవమానాలకు గురైన సందర్భాల్లో సభను బహిష్కరించి, ప్రజా తీర్పుతో తిరిగి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ కూడా అదే తరహాలో ప్రజల్లోకి వెళ్తారని హరీశ్ రావు అన్నారు.
రేవంత్ రాజీనామా చేయాలి: హరీశ్ రావు
కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై స్పందించిన హరీశ్ రావు.. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ హామీలను అమలు చేయలేకపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెస్తోందని విమర్శించారు.
