హైదరాబాద్ శివారులోని మణికొండలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీఆర్‌సీ బిల్డింగ్ సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

సిలిండర్ పేలిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే దుకాణం మొత్తం మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటల తీవ్రతతో దుకాణంలోని సామగ్రి కాలిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు పక్కనున్న దుకాణాలు, భవనాలకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదంతో కొద్దిసేపు అక్కడ భయాందోళన నెలకొంది.
గ్యాస్ లీకేజీ కారణంగానే సిలిండర్ పేలిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం, ఆస్తి నష్టం వివరాలు అధికారుల విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
