భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ నియామకాలు 14 శాతం వృద్ధి చెందినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ వెల్లడించింది. సంస్థ విడుదల చేసిన ‘జాబ్‌స్పీక్ ఇండెక్స్’ నివేదికలో ఈ వివరాలను పేర్కొంది.
నివేదిక ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో 2,664 పాయింట్లుగా ఉన్న జాబ్‌స్పీక్ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్టు నాటికి 3,028 పాయింట్లకు చేరింది. ఆటోమొబైల్, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ రంగాల్లో నియామకాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఆటోమొబైల్ రంగంలో నియామకాలు 19 శాతం పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో 16 శాతం, రిటైల్ రంగంలో 15 శాతం వృద్ధి నమోదైంది.
మెట్రో నగరాల్లో హైదరాబాద్ 23 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా 22 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భువనేశ్వర్ 32 శాతం వృద్ధితో ముందంజలో నిలవగా, రాయ్‌పూర్ 23 శాతం, సూరత్ 21 శాతం, రాంచీ 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఐటీతో పాటు ఐటీయేతర రంగాల్లోనూ ఉద్యోగ నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించిందని నౌకరీ డాట్ కామ్ తెలిపింది. ఫ్రెషర్ల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల వరకు అన్ని అనుభవ కేటగిరీల్లో నియామకాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
