హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు ఏఐపీసీ ఛైర్మన్‌గా పనిచేసిన ప్రవీణ్ చక్రవర్తి సేవలను కాంగ్రెస్ పార్టీ ప్రశంసించింది. ఆయన స్థానంలో మధు యాష్కీని నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ ప్రచారంలో కీలక పాత్ర
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధు యాష్కీ కీలకంగా వ్యవహరించారు. అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్టీ అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన యాష్కీకి తాజాగా జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కింది.
రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా..
మధు గౌడ్ యాష్కీ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఆయన పలు సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
అయితే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు.
టీపీసీసీ అధ్యక్ష పదవిపైనా చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖాళీ అయిన టీపీసీసీ అధ్యక్ష పదవికి మధు యాష్కీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఆ బాధ్యతలను మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించింది.
ఈ నేపథ్యంలో తాజాగా మధు యాష్కీకి ఏఐపీసీ జాతీయ ఛైర్మన్ పదవి దక్కడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
