రేషన్ దుకాణాల్లో రికార్డుల పరిశీలన..
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో వంటగది తనిఖీ
దిశ, మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు సంక్షేమ వసతి విద్యాసంస్థల్లో ఆహార నాణ్యతను పరిశీలించింది.
తొలుత మేడ్చల్ పట్టణంలోని పలు చౌక ధరల దుకాణాలను కమిషన్ బృందం సందర్శించింది. రేషన్ దుకాణాల్లో ఉన్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై డీలర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రికార్డుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.
అనంతరం మేడ్చల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను ఫుడ్ కమిషన్ బృందం సందర్శించింది. అక్కడి వంటగది, నిత్యావసర సరుకుల నిల్వలను పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేసింది.

విద్యార్థులకు అందించే భోజనం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాల నిల్వ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
