ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓట్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)ను ఆయన ‘రక్తం చిందని మారణహోమం’ (బ్లడ్‌లెస్ జెనోసైడ్)గా అభివర్ణించారు. దేశంలో ఆధునిక సెన్సార్‌షిప్ కొనసాగుతోందని, ప్రజలను భయాందోళనలకు గురిచేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని లమకాన్‌లో గురువారం పాలస్తీనియన్ రచయిత్రి ఇబ్తిసామ్ అజెమ్ రచించిన ‘ది బుక్ ఆఫ్ డిసపియరెన్స్’ నవల తెలుగు అనువాదం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు 12 కోట్ల మంది ఓటర్ల పేర్లు నిశ్శబ్దంగా జాబితా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని, అనంతరం జనాభా లెక్కలు చేపడతారని పేర్కొన్నారు. ఇదంతా ఒక పెద్ద ప్రణాళికలో భాగమని ఆయన విమర్శించారు.

ప్రజల డేటాను ఉపయోగించి కులం, వివాహాలు, సామాజిక వర్గాల ఆధారంగా ప్రజలను గుర్తించే పరిస్థితి ఏర్పడుతోందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
దేశంలో నెలకొన్న భయానక వాతావరణం కారణంగా రచయితలు, సినీ దర్శకులు, ఫిల్మ్ మేకర్లు స్వీయ నియంత్రణకు లోనవుతున్నారని అన్నారు. ఫిల్మ్ సర్టిఫికేషన్, నోట్ల రద్దు, మూకదాడులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనా అంశంతో పాటు, సినిమా రంగంలో తాను ఎదుర్కొన్న సెన్సార్‌షిప్ అనుభవాలను కూడా కార్యక్రమంలో పంచుకున్నారు.
