పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాల చుట్టూ మొదలైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. దుర్గాపూజ, నవరాత్రుల సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారం తీసుకోకూడదని బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తనదైన శైలిలో స్పందించారు. కౌశికి అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ కాళీమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ‘భోగ్’ను స్వీకరించారు. చేప తల, ఫ్రైడ్ ఫిష్, బాసంతి పులావ్‌తో కూడిన భోగ్‌ను సువేందు అధికారి కింద కూర్చుని తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నవరాత్రుల్లో నాన్‌వెజ్ తీసుకునేవారిని ‘పాఖండీ’ అంటూ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. దుర్గాపూజ సమయంలో మాంసం, మద్యం దుకాణాలను మూసివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ నేతలు స్పందిస్తూ.. ప్రజల ఆహారపు అలవాట్లను ఏ ఆధ్యాత్మికవేత్త శాసించలేరని పేర్కొన్నారు. బెంగాల్‌లోని శాక్తేయ సంప్రదాయంలో చేపలు, మేక మాంసాన్ని దేవతలకు నైవేద్యంగా సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారమని తెలిపారు.
తాను సనాతన హిందువునని చెప్పిన సువేందు అధికారి.. మహాష్టమి రోజున సాత్విక ఆహారం తీసుకుంటానని, కాళీమాతకు సమర్పించిన ప్రసాదంగా చేపలు, మేక మాంసాన్ని స్వీకరిస్తానని గతంలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాళీఘాట్‌లో సువేందు భోగ్ స్వీకరించడం బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నామనే రాజకీయ సందేశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
