భారత సైనిక వ్యూహాత్మక ఆలోచనా విధానానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత ఆర్మీ మాజీ అధికారులు లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా, లెఫ్టినెంట్ కల్నల్ పవిత్రన్ రాజన్ రూపొందించిన పరిశోధన పత్రాన్ని నాటో భాగస్వామ్యంతో వెలువడిన అంతర్జాతీయ అధ్యయనంలో పలుమార్లు ప్రస్తావించారు.
‘హైబ్రిడ్ వార్: థ్రెట్స్ టు పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ పేరుతో రూపొందించిన ఈ అధ్యయనంలో హుడా, రాజన్ పరిశోధనను కనీసం 10 సార్లు ఉటంకించారు. వీరిద్దరూ కలిసి ‘బియాండ్ ది కైనెటిక్: డీకన్‌స్ట్రక్టింగ్ వార్ఫేర్ ఇన్ ది సోషియో-టెక్నికల్-కాగ్నిటివ్ బాటిల్స్పేస్’ పేరుతో పరిశోధన పత్రాన్ని రూపొందించారు. న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ (CSDR) ఈ పత్రాన్ని జనవరి 2026లో ప్రచురించింది.
ఆధునిక యుద్ధం కేవలం ఆయుధాలు, సైనిక బలంతో మాత్రమే పరిమితం కాదని ఈ పరిశోధన వివరించింది. సమాచార ప్రవాహం, సోషల్ మీడియా, డిజిటల్ వేదికలు, కృత్రిమ మేధ వంటి అంశాలు కూడా యుద్ధ ఫలితాలను ప్రభావితం చేయగలవని పేర్కొంది.
ప్రజల ఆలోచనలు, నిర్ణయాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రత్యర్థి సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చని పరిశోధన వివరించింది. ఈ అంశాలను నాటోకు అనుబంధంగా వెలువడిన అధ్యయనంలోని ‘ఏఐ అండ్ కాగ్నిటివ్ వార్ఫేర్’ అధ్యాయంలో విస్తృతంగా ప్రస్తావించారు.
ఓఓడీఏ (Observe, Orient, Decide, Act) విధానంతో పాటు ప్రత్యర్థి నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా ‘కాగ్నిటివ్ డామినెన్స్’ సాధించే అంశాలను కూడా అధ్యయనం చర్చించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ వంటి సాంకేతికత వినియోగం, క్లియర్‌వ్యూ ఏఐ ద్వారా రష్యా సైనికులను గుర్తించే ప్రయత్నాలు, విద్యుత్ గ్రిడ్‌పై దాడులు, తప్పుడు సమాచారం, మానసిక యుద్ధం వంటి అంశాలపై కూడా హుడా, రాజన్ పరిశోధనను ప్రస్తావించారు.
ఈ గుర్తింపుపై మాజీ ఆర్మీ చీఫ్, మిజోరం మాజీ గవర్నర్ జనరల్ వీకే సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు భారత వ్యూహాత్మక ఆలోచనా విధానానికి ‘మైలురాయి’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
