హైదరాబాద్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి.. ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. కొంతకాలం క్రితం ఆమెకు పరిచయమైన ఓ యువకుడు ఆమెను మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లతో మభ్యపెట్టి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత అతని పరిచయస్తుల్లో మరికొందరు కూడా బాలికను మత్తు పదార్థాలకు అలవాటు చేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక
బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సెప్టెంబర్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
అక్కడ పరిచయమైన ఓ యువకుడు తన స్నేహితుడి సహాయంతో బాలికను మభ్యపెట్టి తన వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి పలువురు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
రైల్వే స్టేషన్ల మధ్య కూడా ఘటన
బాలికను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు పలుమార్లు ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ దశలో బాలికను బొల్లారంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక తిరిగి బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. నిందితులు మరోసారి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం మేడ్చల్ రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లి రైలులో కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు
నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక సెప్టెంబర్ 10న ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలికకు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించే ప్రక్రియతో పాటు.. ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మైనర్ కావడంతో కేసును POCSO చట్టం కింద దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికను ఎలా పరిచయం చేసుకున్నారు, మత్తు పదార్థాలు ఎవరి ద్వారా అందాయి, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
