కార్తీ కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘సర్దార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి సీక్వెల్ కి సంబంధించిన వార్తలు ఊరిస్తూనే వచ్చాయి. 2022లో విడుదలైన ఆ సినిమాకి ఇంతకాలానికి సీక్వెల్ కుదిరింది. ‘సర్దార్ 2’ పేరుతో ఈ సినిమాను నిర్మించారు. ఆషికా రంగనాథ్ .. రజీషా విజయన్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ రోజు (సెప్టెంబర్ 10)న థియేటర్లలో విడుదలైంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు.
1981లో జపాన్ కి సంబందించిన ఒక కాప్సిల్ ఇండియాలో ఉండిపోతుంది. అది ఒక భయంకరమైన బయో వెపన్. అడవీ ప్రాంతంలో వదిలివేయబడిన ఆ కాప్సిల్ నుంచి విషవాయువు లీక్ అవుతూ ఉంటుంది. దాంతో అడవిని నమ్ముకుని జీవిస్తున్న వారంతా చిత్రమైన వ్యాధితో బాధపడుతూ చనిపోతూ ఉంటారు. ఆ కాప్సిల్ ను యాక్టివేట్ చేయాలన్నా .. డీ యాక్టివేట్ చేయాలన్నా మూడు తాళాలు అవసరమవుతాయి. ఆ మూడు తాళాలు గతంలో ‘రా’లో పనిచేసిన వాల్ రస్ .. జారా .. ఏజెంట్ టైగర్ దగ్గర ఉంటాయి. ఆ కాప్సిల్ ను ఓపెన్ చేయాలంటే, ఈ మూడు కీస్ ను ఒకేసారి ఉపయోగించవలసి ఉంటుంది.

‘రా’ టీమ్ కి సహకరిస్తూ వస్తున్న సర్దార్, అడవిలోని గిరిజనులను చూసి చలించిపోతాడు. ఆ బయో వెపన్ కి నుంచి వెలువడుతున్న విషవాయువుల వలన వస్తున్న జబ్బులకు విరుగుడు కూడా జపాన్ దగ్గరే ఉందని తెలుసుకుంటాడు. ఆ మెడిసిన్ ను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇండియా మీదుగా తరలించబడుతున్న ఆ మెడిసిన్ కి సంబంధించిన బాక్సులను, ఇండియాలోనే ఆపేసి గిరిజనుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు.
అయితే వాళ్లు చేపట్టిన ‘ఆపరేషన్ డోకు’ అసంపూర్తిగా ఆగిపోతుంది. సర్దార్ ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. కాప్సిల్ కి సంబంధించిన తాళాలు కలిగిన వాల్ రస్ ఒక దాడిలో చనిపోతాడు .. ‘జారా’ కూడా చనిపోయిందనే వార్తలు వస్తాయి. ఇక ఏజెంట్ టైగర్ మాఫియా ముఠా నాయకుడైన ‘బ్లాక్ డాగర్’ (ఎస్ జె సూర్య) చేతికి బందీగా చిక్కుతాడు. ఏజెంట్ టైగర్ దగ్గరున్న ఒక ‘కీ’ని బ్లాక్ డాగర్ సొంతం చేసుకుంటాడు. మిగతా రెండు ‘కీస్’ కోసం అతను ప్రయాత్నిస్తూ ఉంటాడు. జపాన్ కాప్సిల్ ను యాక్టివేట్ చేసి,దేశాన్ని నాశనం చేయాలనేది అతని ప్లాన్.
‘సర్దార్’ కొడుకైన విజయ్ ( కార్తీ) తన తండ్రి జాడ తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు. ఆ సమయంలోనే అతనికి ‘మిషన్ డోకు’ గురించిన విషయం తెలుస్తుంది. ఆ ఆపరేషన్ విషయంలో తన తండ్రి ఎందుకు విఫలమయ్యాడనేది తెలుసుకుని దానిని పూర్తి చేయాలని భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అసలు బ్లాక్ డాగర్ ఎవరు? బయో వెపన్ ద్వారా అందరి నాశనాన్ని అతను ఎందుకు కోరుకుంటున్నాడు? అనేది మిగతా కథ.
క్షణాల్లో మానవాళిని అంతం చేసే ఒక బయో వెపన్, ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది. జపాన్ కి చెందిన ఆ కాప్సిల్ నుంచి విషవాయువులు లీక్ అవుతూ ఉంటాయి. ఆ కాప్సిల్ ను యాక్టివేట్ చేసి అందరినీ నాశనం చేయాలనేది విలన్ కి గల బలమైన కోరిక. ఆ కాప్సిల్ ను డీయాక్టివేట్ చేసి అందరి ప్రాణాలను కాపాడలనేది ‘సర్దార్’ ఆలోచన. అందుకోసం రెండు వైపుల నుంచి సాగే పోరాటమే ఈ సినిమా.
