మేడ్చల్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్టీ అగ్రనేతల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానిక బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ప్రాంతాల్లో వాటిని చించివేసి నిరసన తెలిపారు.
ఐడీపీఎల్, సుచిత్ర ప్రధాన రహదారుల వెంట ప్రీతిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫొటోలు లేకపోవడం వివాదానికి దారితీసింది.
ఫ్లెక్సీల్లో కేవలం మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానిక పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వాన్ని విస్మరించి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఈ క్రమంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేశారు. మల్లారెడ్డి కుటుంబం పార్టీ క్రమశిక్షణను పాటించాలని, ఇదే తరహా పరిణామాలు పునరావృతమైతే తీవ్రంగా స్పందిస్తామని కొందరు కార్యకర్తలు హెచ్చరించారు.
అయితే ప్రీతిరెడ్డి అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఈ చర్యలను తప్పుబట్టారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను పార్టీ రాజకీయాలతో ముడిపెట్టి వివాదం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీల్లో పార్టీ అగ్రనేతల ఫొటోలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఏమిటని ప్రశ్నించారు.

ఇప్పటికే మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో మల్లారెడ్డి వర్గానికి, స్థానిక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. తాజాగా ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల వ్యవహారం ఆ విభేదాలను మరోసారి బహిర్గతం చేసినట్లయింది. ఫ్లెక్సీల చుట్టూ మొదలైన వివాదం మేడ్చల్ బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
