హైదరాబాద్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే ఫ్లాట్ల కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
లబ్ధిదారులకు అందించే కేటాయింపు పత్రాల్లో ఫ్లాట్ వివరాలతో పాటు మొదటి విడతగా చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపునకు సంబంధించిన గడువు, ప్రభుత్వం సూచించిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

7,340 ఫ్లాట్లకు లక్కీ డ్రా
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ పథకం కింద మొత్తం 7,340 ఎల్‌ఐజీ ఫ్లాట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఫ్లాట్ల కోసం లక్కీ డ్రా ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
లక్కీ డ్రాలో ఎంపికైన వారిలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 6,660 మంది దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్లు వి.పి. గౌతమ్ వెల్లడించారు. వారిలో 5,521 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తుదారుల వెరిఫికేషన్‌ను కూడా త్వరగా పూర్తి చేసి అర్హులైన వారందరికీ కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.
మధ్యవర్తులను నమ్మొద్దు
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు అధికారులు కీలక హెచ్చరిక చేశారు. ఫ్లాట్ కేటాయింపు లేదా చెల్లింపుల విషయంలో ఎవరైనా మధ్యవర్తులు, బ్రోకర్లు సంప్రదిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం సూచించిన అధికారిక ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులకు నగదు లేదా కమీషన్ చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఎల్‌ఐజీ హౌసింగ్ పథకానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసినట్లు గతంలో హౌసింగ్ శాఖ వెల్లడించింది.
ఇల్లు రాని వారికి రూ.10 వేల ఈఎండీ రీఫండ్
లక్కీ డ్రాలో ఫ్లాట్ దక్కని దరఖాస్తుదారులకు చెల్లించిన రూ.10,000 ఈఎండీని తిరిగి చెల్లించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. హౌసింగ్ బోర్డు వివరాల ప్రకారం, ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన వారికి సంబంధిత చెల్లింపు విధానం ద్వారా రీఫండ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఒక్కో ఫ్లాట్‌పై రూ.5 లక్షల సబ్సిడీ
CURE పరిధిలో చేపట్టిన ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తోంది. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించగా, లబ్ధిదారులు రూ.6 లక్షలను విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హౌసింగ్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫ్లాట్ల మార్కెట్ విలువతో పోలిస్తే లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించేలా పథకాన్ని రూపొందించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని CURE ప్రాంతంలోని 16 నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, ఫీల్డ్ వెరిఫికేషన్, కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ అర్హులైన కుటుంబాలకు సొంతింటి కల సాకారం కానుంది.
లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్, కేటాయింపు వివరాలు, ఇతర సమాచారాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు.
