నల్గొండ: వినాయక చవితి వేడుకల సమయంలో నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గణపతి పూజలు నిర్వహిస్తున్న పూజారి ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. పూజ చేసే విషయంలో కొందరు స్థానికులతో వాగ్వాదం జరిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెంలో సోమవారం ఈ ఘటన జరిగింది. నాగార్జున సాగర్‌కు చెందిన ఉప్పల దత్తు ప్రసాద్ గ్రామంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు చేస్తున్నారు.
ఈ సమయంలో గుండాల రవి, పున్నయ్య అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి తమ మండపంలో ముందుగా పూజ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో పూజారితో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిచెప్పిన అనంతరం దత్తు ప్రసాద్‌ను మరో గణేశ్ మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పూజ పూర్తి చేసిన కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూజారి మృతికి వాగ్వాదమే కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
